6, జనవరి 2021, బుధవారం

04.01.2021 నిత్య పద్య ప్రణాళిక 2 - తి రు మ ల

 


04.01.2021 సోమవారము - గైహికము

నిత్య పద్య ప్రణాళిక - 2

తి  రు  మ ల 

ఈ అక్షరాలు   వాడుకుంటు  చక్కని పద్యము  తేటగీతి వ్రాయండి

 

 

అల(తి)పదముల పద్యముల్ యనువుగాను

యల(రు)చు రచియింపగ నేర్పి నయ్య వారు

మార్గ (మ)దియె నిర్దేశించ మనసు లోని

శంక (ల)న్నియు మాయమై సత్తువొచ్చె

 

అనువు=యుక్తము

అవళూరు సీతమ్మ

 

 

మొదటి అక్షరాలుగా తి రు మ ల. - తే. గీ.

తిన్నదెక్కువై యరగక త్రేంచు చుండె

రుచుల లౌల్యాన మితిని మరచె నతండు!

మనిషి బుద్ది నహో..జిహ్వ మాయ జేయు

లక్ష్య పెట్టకనున్న స్థూలమగునొడలు!!

డా. నాగులపల్లి

 

 

నగజ జేసెను నలుగుతో నరుని బొమ్మ

ప్రాణమునుపోసి మార్చెను బాలుని వలె

వాకిటను యుండి కావలి వాని వలెను

శివునియడ్డగించగ వాని శిరము దునిమె

కరి శిరము వానికతికించగ గజముఖుని

జేసి సంతసించెను తల్లి జ్యేష్ఠుని గని

తదుపరి కుమార స్వామి యాతనికి సోద

రునిగ జనియించి గణముల గనుటకునధి

పతిని జేయుమనుచు కోర ప్రథము డయిన

గజముఖుడు తన ప్రతిభచే గణముల కధి

పతిగ సకల లోకములకు పతిగ నిలిచె

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

తే.గీ.

తిరిపెమెత్తి నీ దరి జేరితి, దయ తోను

కావవే, గరుడధ్వజ! కరుణతోడ

కాచి మము దరి జేర్చవే, కమలనాభ!

భువిని వెలసిన దైవమా, పుష్కరాక్ష!

 

భూలోక వైకుంఠమగు తిరుమలకు జోలె కట్టి మొక్కు తీర్చుచుటకు, ఆ వేంకటేశుని శరణు కోరు భక్తుల మొర పై వ్రాసాను!!

 

 

1.

తి రుమలగిరి లో శ్రీవారి దివ్యమౌ చి

రు దర  హాసము దర్శించి లోకనాధ

మ లయ వాసుని సన్నిథిన్ మైమరపున

ల క్ష్మి నాధుడా వేంకట రమణ యనుచు

ఏడు కొండల స్వామిని వేడు కొందు

 

2.

తి య్య నైన యతిమధుర తెలుగు పద్య

రు చిని చవిచూసి నంతనే లుప్తమైన

మ ధుర భావనల్ మొలకెత్తు మల్లె జాజు

ల పరిమళ మోలె సత్కవుల్ రచన లందు

రమ

 

 

తి రుమలేశుని స్మరణచే దివ్య ముగను

రు బ్బ వలెమది నజ్ఞాన రోగములను

మ లిన మంతయు వడగట్టి మాన్యు లయ్యి

ల క్షణంబుగ జీవించ రక్షణదియె

 

తిరిపరికి తిండి లేకను  తిరుగు చుండ

రుచులు గోరి కొందరు జిహ్వ   లోలురయ్యి 

మట్టి పాల్జేతు రన్నమున్ మదముతోడ 

లక్ష్మి పతినిజమేగ వీరమణి మాట

గాండ్ల వీరమణి

 

 

(తి)రుమలగిరిన వెలసిన దీన జనుల,

(రు)గ్మతలనుతీర గనుండె రుజువు గాను

(మ)మ్ము  కరుణతో  చూడుమ , మరపు లేక

(ల)క్ష్మి తోడను కొలుతుము లక్ష  ణముగ

 

 

న్యస్తాక్షరి : తి - రు - మ - ల

తిరుగక నొక వత్సరమాయె దీననాధ!

రుజమది కరోన పేరట - ప్రజలు బెదరె,

మనసులు చెదరి వేసారె, మందు లేదు

లక్షణముగ నిప్పటికింక! రామలింగ!

 

తీవ్ర మోక్షేక్ష గలవారు (తి)రుప తిగని

తి(రు)మ లేశుని దర్శించ తీరు కోర్కె

(మ)రపు రానట్టి రూపము మహిని కనగ

లక్ష్మి పతినిసే వించుటే లక్ష్య ముగను

మనన చేయుట ముక్తికి మార్గ మగును

కే‌.ఎస్‌.డి.

 

 

తిట్టిన తిట్టులే తమకిక  దీవె నంటు

రుజువు జూపించె తల్లికి లోక ముందు 

పరమ బద్దకు డనువారు పదవి పొంది

తిరుగు చుంటిరి ఎన్నెన్నో తీర్ధ ములని!

 

తిరుమ లేశుని దర్శించి తిరిగి రాగ

రుజలు తగ్గిపోయినవని రుజువుజూప

మనసు తెరవగ వెలుగుగా మార్పు తెలిసి

లక్ష్మి నాధుని మహిమలే లక్ష తీర్లు!

నీరజ

 

 

తిరుమల గిరిన వెలసిన దీనబంధు

మరులు గొని ప్రకృతి ఒడిలో మధుర నాధ

మనసున తపియించి తలువుమా  నిరతము

లబ్ధి పొందగ నివ్వగలడె ముకుంద

అనూరాధ

 

 

(తి)రుమల గిరి నిలయ నిను తీరుగా గొ

లుచుటయే చాలు మ(రు) యాశలు యిక లేవు

(మ)నవి విని నను బ్రోవుమా మంగ నాథ!

స్వామి! యఖి(ల) బ్రహ్మాండ రక్షకుడ వీవు!

సునీత మూర్తి

 

తిప్పలు యనకుండ తనను తిప్పి చుట్టి

రుంజుకొను అల్లరి కొడుకు రుసరుసలను

మరచి కడుపు నింపు యశోద మాత ముద్దు

ల తనయుడు కృష్ణు చేరి కొలచెద మమ్మ

రుంజుకొను - విసుగు కొను

సతీష్

 

 

తి విరి పోకార్చ నజ్ఞాన తిమిరమంత

రు చుల నడగించి శోధించ లోతులన్ని

మ నసు నిగ్రహించగ భక్తి మార్గమెంచి

ల క్ష్యమదియె మనుజులకు లక్ష్మినొంద

వాణిశ్రీ నైనాల

 

 

తేటగీతి

తీర్చ నాకలి పడుదురు తిప్పలెన్నొ

కరువు కాటకాల వలన  కడుపు మాడ

పనులు లేకయే మనుజులు పలు విధముల

వెడలు నిజపురిని వదలి వేగ వలస

సుమలత

 

 

తేటగీతి :-

1 తి య్య నైనపలుకు గల్గి తేనె లొలుకు

 రు చిర కావ్య సంపదలెల్ల రూఢి గాను

 మ ధికమైన సుందరమగు తెలుగు నిలను

 ల క్ష ణంబుగ భాషించు లలిత గతిన

 

2 .తి మ్మ రుసుబెంచె ప్రీతితో  తేట తెలుగు

రు వ్వు రాజక వీంద్రుడిన్ లోక మందు

మ మత గల్గియు నుప్పొంగె మాన సంబు

ల క్ష్యసిద్ధియై రాయలున్ రాజు జేసె

రాచపూడి జయ సుశీల

 

 

తేటగీతి

(తి)రుమ లేశుని చూడగా తిరుప తికిని

మరల పోయవ చ్చినాను మ(రు)పు రాని

స్వామి రూపము (మ)దిలోన సాక్ష్య మయ్యి

నిలిచె క(ల)లోన కూడను నిత్య ముగను

లలితారెడ్డి

 

 

తే.గీ.

1. తిరుమలందు వెలసినట్టి తిరుమలేశ

రుగ్మతలు మాపెటటువంటి రూపు గలడు

మహిమ గలిగిన కలియుగ మాన్యుడయ్య

 లక్ష్మి పతిని కొలుచుట నా లక్ష్య మగును

 

2.తిరుగు చుంటిని యజ్ఞాన తిమిర మందు

పద్య బోధన చేసి గురుడు భవిత మార్చె

మంచి బోధించు పూజ్యులు మాకు గలరు

పద్య మాలతో గురునకు వందనాలు

మంత.సక్కుబాయి

 

 

తేటగీతి

1.(తి)రుగు పయనము యెప్పుడొ తెలియ దిలను (దాత్మ )

 బతుకు నందున  నభి(రు)చి బాయ కుండ

(మ)లచు కొనవలె భవితను మహితముగను

(ల)క్ష్య సాధనంబె జన్మ లక్ష్య మవగ

 

2.మరలి పోయిన కాలము (తి)రిగి రాదు

మనము చేసిన పుణ్యము మ(రు)గుగాదు 

(మ)హిని నిల్చును తోడయి మహిమ జూపి

నిత్య సత్యమిదియె (ల)క్ష్మి నీవు నమ్ము

విజయ లక్ష్మి

 

 

తివిరి యమ్మ సౌజన్యము తెలుప యెడరు

రుగ్మతమరి యధర్మమెరుగని తీరు

మనసు సంపెంగ విరులగు మాల జేసి

లలితమగు జీవితమొసగెను రమ్యముగను

హిమరాణి

 

 

తిరుమల గిరిపై వెలసిన తిరుమలేశ

రుగ్మతలను పోగొట్టెడిరూపు వాడు

మదిన తలచుచు వేడెద మరువలేక

లక్ష్యణము గను నిన్ను కొలిచెద తండ్రి.

రామిరెడ్డి

 

 

తేటగీతి

తిరుమల గిరిపై వెలసిన దీనబంధు

మరువకుము నీవు యెన్నడు మాధవయ్య

మనసున నిలుపుమయ్య రామయ్య మమ్ము

లక్ష్మిపతివై వెన్నంటియు రక్షజేయ!

దాక్షాయణి

 

తిరుమ లేశుని కరుణకు తీవరించి

రుగ్మ తలు తీరగ జనులు రుజువుగాను

మహిమ తో ఏడు కొండలు మల్లడించి

లక్ష్మి పతిదీర్చు కోర్కెలు  లభ్యముగను

గీతా శైలజ

తిరుమల గిరివాస త్రిలోక దేవ దేవ

రుజువు చూపగ రావేల రంగ నాథ

మనువు కైతపించు నరుని మదిని గాంచి

లక్ష్మి కిచ్చి లగ్గము చేయు సలక్షణముగ

భీమవరపు జ్యోతి

 

 

భీమవరపు జ్యోతి

 

తిరుమలేశుని రూపము దివ్యముగను

రుణము తీర్చే డి దైవమా లోక రక్ష

లక్ష్మి పతిగాను మమ్మల్ని రక్ష జేయు

జనుల బాధలు తొలగించి జయము నీయు

రుఖ్మిణి

 

 

తే.గీ.

తికమకపడకు యిలలోన దినముదినము

రుణము లేకను జీవించు రోజురోజు

మలిన మెరుగక మసులుకో మంచిగాను

లక్ష్యమేదైన సాదించు భిక్ష్యమెత్తి

కర్చర్ల సత్యనారాయణ

 

 

తిరు నగరినందు వెలసిన తిరునివాస.

రుచితమగు నీదు నామపు రుచినెరింగి

మరిమరి పలికినన్ లేదు మరుజననము

లభ్య మగును వాంఛితములు  లక్ష్మినాధ.

సూరే వెంకటప్పయ్య.

 

 

తేటగీతి

తి రుమల శిఖరంబున గొల్వు దీరియున్న

శ్రీ నివాసుండు క రు ణతో  చేదుకొనడె

యాపదలనుండి  మ నసార నార్తి బిలువఁ ?

కోర్కె ల ను దీర్చు "యిలువేల్పు"! "కొంగు బసిడి" !!

వట్టెం వెంకట రమణ

 

 

తే.గీ.

తిన్న లంచము వెంట రాదే మనంత

మొచ్చినప్పుడు! రుగ్మతల్ మొండి కెత్తి

నపుడు యుపయోగ పడదు మనకు! చరిత్ర

లో నిలపదే మనను దొడ్డ రొచ్చునౌర!

గౌరీనందన్

 

 

తిరుమలగిరి వాసుని జూడ తీర్థ ప్రజలు

తిరుమలకు జేరి ధన్యులై వరము కోర

తిరుమలేశుడు కరుణించి తీర్చు కోర్కె;

తిరుమల కలియుగము నందు గరిమ జూపు

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

తే.గీ.

తిమిర సమ్మేళ దేహంపు దేవళమున

రుచిర విజ్ఞాన పూరిత రోచులమర

మలిన సంప్రోక్ష్య పరిశుభ్ర మానసమున

లలిత సౌభాగ్య కైవల్య లక్ష్యమమరు

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తి మిరమును బాప రావయ్య తెల్లని దొర

రు ధిరమిచ్చి మమ్ముల గాంచి ముదము నివ్వు

మ మత పంచవయ్య పిలవ మదనరిపువు

ల క్ష్మి నిచ్చి కరుణ జూపు  రక్షణిచ్చి

 

మదనరిపువు - శివుడు

రుధిరము-బలము

తెల్లనిదొర - శివుడు

సి.హెచ్ రజిత


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు