14, జనవరి 2021, గురువారం

14.01.2021, సంక్రాతి సంబరాలు

 


కవిమిత్రులందరికీ భోగి సంక్రాతి కనుమ శుభాకాంక్షలు

సంక్రాతి సంబరాలు  

 

తేటగీతి పద్యాలు

1.

రవి భ్రమించుచు  ద్వాదశ రాశు లందు

మకర రాశికి ముదముతో మారువేళ

నుత్త రాయణం బందొచ్చె  నుత్స వంబు

సంకురాతిరి తెచ్చును సంబరములు

2.

రైతు  కష్టంబు  ఫలియించి కౌతుకముగ

తాండ వించును  నట్టింట ధాన్య లక్ష్మి

శాంతి సౌఖ్యము లందించి క్రాంతి నింపి

సంకురాతిరి తెచ్చెను సంబరములు

3.

ముదిత లందరు ముత్యాల ముగ్గులేసి

అంద మలరెడు గొబ్బిళ్ళు యందు నిలిపి

పట్టు పావడ గట్టియు పాడు చుండ

సంకురాతిరి తెచ్చెను సంబరములు

4.

మార్గ శిర మాసమందున మంచు తెరన

శీత వాయువుల్ చిలిపిగా చిందులేయ 

భోగి వచ్చును పుష్యమీ పొద్దు నందు 

సంకురాతిరి తెచ్చును సంబరములు

5.

గంగిరెద్దుల మేళంబు గంతు లేయ

కోడిపందెపు లాటల కోల హలము

హరిదాసు సంకీర్తన హ్లాద పరచ

సంకురాతిరి తెచ్చెను సంబరములు

6.

కొత్త బియ్యపు పొంగలి యత్తిరెసెలు

కజ్జకాయలు సకినాల కమ్మదనము

తెలుగు వారింట తీరైన తీపి రుచుల

సంకురాతిరి తెచ్చును సంబరములు

7.

తల్లి ముత్తైదు లందరు పిల్లలకును

బోగి పండ్లను పోయుచు  పొలుపు మీర

పొసగ దీవెన లిత్తురు బోగి నాడు

సంకురాతిరి తెచ్చును సంబరములు

8.

ప్రీతి తోడను స్త్రీలు సంక్రాంతి నాడు

లక్ష్మి దేవిని నోచ పరవశమున సి

రులనొసగిను  శ్రీదేవి పొలుపు లమరగ

సంకురాతిరి తెచ్చును సంబరములు

9.

మూడు రోజుల పర్వము ముచ్చటగను

నవ్య శోభలు గూర్చునా   నంద హేల

పల్లె సీమల కొలువయ్యి పౌష్య లక్ష్మి

సంకురాతిరి తెచ్చును సంబరాలు

10.

భోగి సంక్రాంతి కనుమ వైభోగమలర

శోభగల శుభాకాంక్షలు శుభము లివ్వ

పేర్మి తోడనిడుదుపిన్న పెద్ద లకును

రమణి పలికెనా త్మీయపు రాగసుధలు

గాండ్ల వీరమణి


 

1).

 భోగ భాగ్యము లన్నియు భోగిరోజు

నూత్న కాంతులు వెదజల్లు నూతనముగ

కొత్త కోరిక లన్నియు కొలువుదీరి

సంకురాతిరి దెచ్చును సంబరములు

2).

సంక్ర మణ కాలమున వచ్చె సంకురాత్రి

మకర సంక్రాంతి రోజున మార్పుతోడ

దక్షి ణాయన మునుబోయె దయనుజూపి

ఉత్త రాయణ మేతెంచె ఉర్విపైన

సంకురాతిరి దెచ్చును సంబరములు

3).

పెద్ద లందరి కొదులును పేర్మితోడ

తర్ప ణములన్ని  వదులుచు తలచుకొంటు

పెద్ద లాశీస్సులన్నియు పెల్లిదముగ

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

4).

 బాల బోగము జేసియు బాలునకును

కృష్ణ కన్నయ్య కునిడిరి గృహమునందు

మాధ వుండును వెతలన్ని మనకుదీర్చె

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

5).

మంగళమనుచు మ్రొక్కగ మధురిపువును

అసుర గుణములు బాపియు అక్షధరుడు

మహిమ జూపుతు వరములుమౌక్తికముగ

మార్గ శీరుష మునవేసె  మాల్యముగను

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

6).

గోవు పూజలు జేసియు కోమలులును

మంచి కూరల యన్నము మాధవునకు

ముప్పది దినములుగనోము ముచ్చటగను

జేసి మురిసిరి ఫలితము జృంభణముగ

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

7).

హరిని  స్మరియిస్తు యాత్మలో హార్ధముగను

హరియ నుజులుపా డగవిని హర్షమొంది

ధాన్య మిడగ దీవించియు దర్శకుండు

మార్గ శీరుషం బునవచ్చి మాయమగును

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

8).

ప్రవర నంతయు జదువుచు ప్రజ్ఞ మీర

జంగ మములుగ వచ్చియు జాగులేక

పెద్ద లాశీస్సు లందించు ప్రీతిగాను

పప్పు బియ్యమి డగ నూదు వారిజమును

పాప మంతయు బోవగ పరిహృతమయి

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

9).

రంగు రంగుల నల్లిక రమ్యముగను

ముంగి లందున ముగ్గులు ముంపుగొనగ

కొలువు దీర్చిరి వాకిళ్ళ కోమలులును

పసుపు కుంకుమ జల్లిరి పడతులంత

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

10).

నియమ నిష్టల వ్రతమును నింపుగాను

బ్రహ్మచర్యము జేసిన బ్రాజితమును

మానసికబల మునుబెంచు మహిమజూపి

అభయ మిచ్చియు బ్రోవును యనిలసఖుడు

 

11).

ఆరు గాలముల ఫలము అగ్గలించి

అన్న దాత నాలయమందు నరుగుదెంచ

హాలి కునిమనసంతయు హర్షమొంది

పాల పొంగలి బెట్టును పావనునకు

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

 12).

కోడి పందెము లందున కూతలిడుచు

వృషభ ములనంద ముగతీర్చి యూరులందు

చక్ర  తీర్ధము ననుముంచి చక్రధరుని

తెప్ప యుత్సవ మునదిప్పు తీర్ధకరుని

 

13).

పులగ మన్నము పులిహోర పురుషవరకి

కట్టు పొంగలి  కమ్మగ బెట్టిపిదప

గారె లరిశలు బొబ్బట్లు గవ్వలన్ని

చేసి యర్పణ జేసితి చిన్మయునికి

 

14).

రథము నల్లిక చుట్టును రంగవల్లి

తీర్చి దిద్దగ వచ్చెను తీర్ధకరుడు

గోదనెక్కించు కొనిపోయి గోపబాల

పరిణయంబాడి వరమిచ్చె పరమపురుష

 

15).

భోగి మంటలు చేయును బోధమనకు

అసుర గుణములు గాల్చియు నక్షధరుని

ఆత్మ మీరగ పూజింప  యచ్యుతుడిని

జ్ఞాన మిచ్చియు దీవించు జలశయనుడు

 

16).

గొబ్బి యలనుదె చ్చియువారు  గుంపుగూడి

గుమ్మ డివిరుల గుచ్చియు గుండ్రముగను

గొబ్బి యల్లోయ నుచుపాడి కొమ్మలంత

మంచి భర్తను కోరుచు మాధవుడిని

యాద రమునను వనితలు అక్షధరుని

 

17).

బొమ్మ లకొలువు లన్నియు భోగిరోజు

లక్ష్మి దేవిని మధ్యలో లక్షణముగ

కోవె లందున నెలవుగా కొలువుదీర్చి

పుణ్య వతులను బిలిచియు పుడమి మీద

హార తిచ్చిమం గళమంటు హాసినులము

తమ్ములమునిచ్చి బంపియు తన్విలంత

 

18).

గంగి రెద్దుల మేళము గమకముగను

పలికి నూదగ వృషభము పదముతొక్కి

చిత్ర వర్ణాల వ్రేలాడు చీరలన్ని

మూపురమునందు మ్రోయుచు ముచ్చటగను

 

19).

అమ్మ కయ్యకు దండము యచ్చెరువుగ

మోము వంచియు చేయును మోకరిల్లి

తలను యూపుచు నడుగును తండులములు

పాత చీరలి చ్చిన జాలు పరమ ప్రీతి

నిండు గాదీవెనలనిడు నిండు మనసు

నంది పూజలు చేయగ నాత్మ మీర

 

20).

పేడ కలిపియు కళ్ళాపు పేర్మితోడ

ముంగి లలుకుచు జల్లియు ముగ్గుబెట్టి

పసుపు కుంకుమ తోడను పడతులంత

ద్వార బంధము పూజించు ధరణియందు

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

21).

అష్ట వర్ణాల పండుగ నాదినుండి

సంస్కృతి యుసంప్ర దాయాల సాక్షినిదియు

దేశ పౌన్నత్య మునకంత ధీటుగాను

భరత మాత శిఖరమున బంధురముగ

సంకురాతిరి దెచ్చును సంబరములు

గీతాశైలజ

 

 

తేటగీతి : 1

దినకరుండు చలించును తిరముగాను

మకర సంక్రమణము గల్గు మార్దవమున

కొత్త కాంతులు కొంగ్రొత్త కోర్కెలమర

సంకురాతిరి దెచ్చును సంబరములు

 

తేటగీతి : 2

కీడులన్నియు దొలగను  కించ దీర్చి

కిల్బిషము బాప పడదోయ కీలమునను

పొట్లు వస్తులెల్ల దహించు భోగి మంట

సంకురాతిరి దెచ్చును సంబరముల !

 

తేటగీతి : 3

పకపక నగవు  దోడను పడతు లెల్ల

ముదముగను ముంగిటయు రంగు ముగ్గు లిడగ

వసుధ యందును గొబ్బెమ్మ వాసి కెక్క

సంకురాతిరి దెచ్చును సంబరములు !

బి.రాణి లీలావతి


 

పాడి పంటలు తెచ్చెను పసిడి శోభ

పిండి వంటలు తినగోరు ప్రియతములకు

 గాలి పటముల   యల్లరి కాల మనుచు

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

భోగ భాగ్యమిచ్చే రమ భోగినాడు

మకర సంక్రాంతి లక్ష్మి యై మరులి వచ్చు

కనుమ గారెల తేరు  చక్రాలు పైన

సంకురాతిరి తెచ్చును సంబరములు

సతీష్

 

 

బందరందుండిరి మదీయ బంధు గణము

పండుగలవేళ నెయ్యము పదిల పడగ

ఆటపాటల మునుగంగ నాదరించి

కలిసిమెలిసి కేరింతలన్ మెలగు వేళ

గంగిరెద్దుల యాటలు తొంగి చూచి

పిండివంటలు వండగ ప్రీతితోడ

నారగించుచు హాయిగ నాదమరచి

నూతనోత్సాహము మదిని నింపుకొనగ

సంకు రాతిరి తెచ్చును సంబరములు

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, ముంబయి

 

 

భోగముల నొసగు మహము  భోగి గాను

సంబురాల యుద్ధవముగ సంకు రాత్రి

కళలు మురిపించు క్షణములు కనుమ గాను

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పల్లె పల్లెకు వచ్చెను పర్వ కాంతి.

అవని గట్టెను వర్ణపు యంబరాలు

గగన వీధిని వెలసెను గాలి పటము

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

కొండ పల్లి బొమ్మలతోడ కొంటె గాను

ఏటి కొప్పాక పుత్తళ మెంచి నిలిపి

కొలువు చేయుచు మురిసెను  కోమ లాంగి

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

అందమయిన బొమ్మలతోడ అరుదు గాను

ముచ్చటగ సాలభంజిక ముద్దులొలక

రామ సీతల బొమ్మలు రమ్యముగను

కొలువు చేసెను బొమ్మల కొలువు నందు

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పాడి పంటలు నింపెడి పబ్బమనుచు

ధాన్య రాశులతోడ కృదరము నిండ

అన్న దాతలు మురిసెను  అంద ముగను

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

భజన జేసెను హరిదాసు భక్తి తోడ.

గొబ్బి పాడెను కోమలి కోర్కె దీర.

రంగ వల్లులద్దె రమణి రమ్య  ముగను.

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

భోగి పళ్లుగ మారేడి రేగు పళ్ళు

సంప్రదాయ క్రీడల తోడ సంబరాలు

ముచ్చటగొలుపు గొబ్బిళ్ళు ముందు నిలువ

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పాడి పశువుల తోడను పాటి గాను

పాల పొంగళ్లు నిండుగ పసిడి రాశి

గూరి సుఖశాంతులు గలిగి కూర్మి తోడ

సంకురాతిరి తెచ్చును సంబరములు

సూరే వెంకటప్పయ్య

 

 

తే.గీ.

హరిహరియనుచు హరిదాసు హరిని తలచి

దాతలకు సుకృతమును, ముదమునొసగ

ని హరిని యడుగ, సురతము నిడుచు రంగ

వల్లులు వెలసె ముంగిట; పాలు పెరుగు

వెన్న మీగడ పంటలు వెల్లివిరియ,

బంధు సముదాయ సంగతిన్ పాత సృతు

లు, మధుర మధుర భోజ్యములు నెమఱంగ

సంకురాతిరి తెచ్చును సంబరములు.

గౌరీనందన్

 

 

ధాన్యరాసుల గాదెలే ధైర్య మిడగ

పిల్ల పాపల నవ్వులే వెల్గులవగ

యింతి దిద్దెడిముగ్గులే యింటి కింపు

పొలము దున్నే బసవడికి పూజ చేయు

పుణ్య భూమినాదని మది పొంగి పోయె

సంకురాతిరి దెచ్చును సంరములు

రమ,కంకిపాడు


1 కామెంట్‌:

  1. విద్యార్థినీ విద్యార్థులారా

    శుభ ఆశీస్సులు

    సంక్రాంతి శుభాకాంక్షలు

    అందరూ చక్కగా పద్యములు వ్రాసి అలరించుతున్నారు

    అందరికి అభినందనల పూర్వక ఆశీస్సులు
    కొన్ని వ్యక్తి గత కార్యక్రమాలు కారణంగా మీ పద్యములు సమీక్ష. చేయలేక పోతున్బాను

    త్వరలో కలుస్తాను

    విజయోస్తు

    పూసపాటి

    రిప్లయితొలగించండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు